మిర్యాలగూడ, జూలై 3(చైతన్యగళం):
మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిల్లాపురం గ్రామంలో రెండ్రోజుల పాటు విస్తృత పర్యటన చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు.
గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, గృహనిర్మాణం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు నేరుగా వినిపించిన ప్రతి సమస్యను శ్రద్ధగా ఆలకించి సంబంధిత అధికారుల సమక్షంలోనే నమోదు చేయించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
గ్రామంలోనే రాత్రి బస చేసిన ఎమ్మెల్యే BLR ప్రజలతో కలిసి భోజనం చేస్తూ వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. ఉదయం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. “ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం” అని పేర్కొన్నారు.
తదుపరి గ్రామంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అలాగే వీఓ భవనాన్ని ప్రారంభించి మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
ప్రజల నుంచి అందిన వినతులను మరోసారి సమీక్షించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. “ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు కార్యాలయాలకు పరిమితం కాకుండా గ్రామాల్లోనే తెలుసుకుని పరిష్కరించడం మా లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది” అని ఎమ్మెల్యే BLR స్పష్టం చేశారు.
