కల్వకుర్తి, జూలై 3 (చైతన్యగళం): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గాన్ని 15 మండలాలతో కూడిన జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమనేత, కల్వకుర్తి జేఏసీ చైర్మన్ డాక్టర్ అయిల్ సదానందం గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.సదానందం గౌడ్ మాట్లాడుతూ, “కల్వకుర్తి ప్రాంతం చరిత్ర, సాంస్కృతిక వైభవం, ఉద్యమాల పునాది. స్వాతంత్ర్య పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు, తెలంగాణ విద్యార్థి ఉద్యమం, కరువు వ్యతిరేక పోరాటాలు, కేఎల్ఐ నీళ్ల పోరాటం వంటి అనేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. విద్య, వైద్యం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది” అని వివరించారు.జిల్లా కావలసిన లక్షణాలు కల్వకుర్తిలో ఉన్నాయని, కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల్, వంగూరు, చారగొండ, మిడ్జిల్, ఉర్కొండ, ఉకేశంపేట్, వెల్జాల్, రఘుపతిపేట, ఇర్విన్, డిండి మండలాలను కలిపి 15 మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని సూచించారు.“మూడు జాతీయ రహదారులు కలిసే కూడలిగా కల్వకుర్తి ఉంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, తిరుపతి, కోదాడ–రాయచూరు మార్గాలను కలిపే కేంద్రంగా ఇది వెలసింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. భవిష్యత్తులో విద్య, వైద్యం, వాణిజ్య రంగాల్లో కల్వకుర్తి మరింత అభివృద్ధి చెందుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.సదానందం గౌడ్ విజ్ఞప్తి చేస్తూ, “గతంలో 6, 7, 8 మండలాలతో జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 15 మండలాలతో కల్వకుర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం న్యాయబద్ధమైన కోరిక. ప్రజలందరి అభిలాషను నెరవేర్చాలని” ముఖ్యమంత్రిని కోరారు.
