కరీంనగర్,జూలై 6(చైతన్యగళం): ఆన్‌లైన్ సేవల పేరిట ప్రముఖ సంస్థలు వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాల డెలివరీలో కనీస ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా కరీంనగర్ నగరంలోని గాంధీ రోడ్‌లో గల ఫ్లిప్కార్ట్ ఆన్‌లైన్ స్టోర్ యాప్ ద్వారా ఓ వినియోగదారుడికి తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే గడువు ముగిసిన పానీయాన్ని డెలివరీ చేయడమే కాకుండా, దాన్ని చిన్నారులు తాగడంతో సదరు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.

స్థానిక గాంధీ రోడ్ ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు సోమవారం మధ్యాహ్నం ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా 1.2 లీటర్ల ‘మాజా’ బాటిల్‌ను ఆర్డర్ చేశారు. ఆర్డర్ ఇంటికి రాగానే, అందులోని డ్రింక్‌ను ఇంట్లోని చిన్నపిల్లలు తాగేశారు. ఆ తర్వాత బాటిల్‌ను నిశితంగా గమనించిన సదరు వినియోగదారుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ బాటిల్‌పై ఉన్న గడువు అప్పటికే ముగిసిపోయింది.
విషయం తెలిసిన వెంటనే సదరు వినియోగదారుడు ఆన్‌లైన్ స్టోర్ ఇంచార్జ్‌ను కలిసి తీవ్రస్థాయిలో నిలదీశారు. నిర్వాహకులు తమ పొరపాటును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. పాత బాటిల్‌ను వెనక్కి తీసుకుని, మరో కొత్త బాటిల్ ఇస్తామంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినియోగదారుడు అందుకు నిరాకరించారు. గడువు ముగిసిన పానీయం తాగడం వల్ల నా పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా దానికి ఫ్లిప్కార్ట్ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు.
రోజురోజుకూ ఆన్‌లైన్ వ్యాపారాలు విస్తరిస్తున్నా, నాణ్యతా ప్రమాణాల తనిఖీలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్యాకింగ్ చేసే సమయంలో ఎక్స్‌పైరీ డేట్‌ను కూడా చూసుకోకుండా డెలివరీ చేయడంపై స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు ఇలాంటి ఆన్‌లైన్ స్టోర్ల గోదాములపై తక్షణమే తనిఖీలు చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
