అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ మధ్య అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం.. ఇరాన్‌పై అమలులో ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షల సడలింపుతో విడుదలయ్యే నిధులను ఆహార కొనుగోళ్లకే వినియోగించాలని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ఆహారాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని నిబంధన ఉన్నట్లు చెప్పారు. ‘ఆంక్షల సడలింపు ద్వారా విడుదలయ్యే నిధులన్నీ ఆహార కొనుగోళ్ల రూపంలో తిరిగి అమెరికాకే వస్తాయ్. ఇరాన్‌లో 9.1 కోట్ల మంది జనాభా ఉండటంతో ఆహార అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం అమెరికా రైతులకూ ప్రయోజనం చేకూర్చనుంది’ అని ట్రంప్ తెలిపారు.
ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపివేయడం సహా ముడిచమురు ధరల పెరుగుదలకూ కారణమయ్యాయి.
