CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 8:11 am Posted by : CHAITHANYA GALAM NEWS

ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఒప్పంద నిబంధనల్ని ఇరాన్ ఉల్లంఘించినా, సక్రమంగా వ్యవహరించకపోయినా తగు చర్యలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

కాగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్ మధ్య అమెరికా-ఇరాన్ తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం.. ఇరాన్‌పై అమలులో ఉన్న కొన్ని ఆర్థిక ఆంక్షల సడలింపుతో విడుదలయ్యే నిధులను ఆహార కొనుగోళ్లకే వినియోగించాలని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ ఆహారాన్ని అమెరికా నుంచే కొనుగోలు చేయాలని నిబంధన ఉన్నట్లు చెప్పారు. ‘ఆంక్షల సడలింపు ద్వారా విడుదలయ్యే నిధులన్నీ ఆహార కొనుగోళ్ల రూపంలో తిరిగి అమెరికాకే వస్తాయ్. ఇరాన్‌లో 9.1 కోట్ల మంది జనాభా ఉండటంతో ఆహార అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం అమెరికా రైతులకూ ప్రయోజనం చేకూర్చనుంది’ అని ట్రంప్ తెలిపారు.

ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపివేయడం సహా ముడిచమురు ధరల పెరుగుదలకూ కారణమయ్యాయి.