ఫిఫా ప్రపంచ కప్ 2026 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె 2 గోల్స్‌తో అదరగొట్టాడు.
మ్యాచ్ ఆరంభం నుంచే ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె దూకుడుగా ఆడాడు. 14వ నిమిషంలో అద్భుత గోల్‌తో ఎంబాపె జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. బాక్స్ వెలువల నుంచి అతడు కొట్టిన షాట్‌ను ఇరాక్ గోల్‌కీపర్ అడ్డుకోలేకపోయాడు. ఫస్టాఫ్ నుంచి పోరాడుతున్న ఇరాక్.. ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అయితే విరామం అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వాతావరణం అనుకూలించిన తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. దీర్ఘ విరామం తర్వాత ఫ్రాన్స్ మరింత ఉత్సాహంతో బరిలోకి దిగింది. 54వ నిమిషంలో ఇరాక్ గోల్‌కీపర్ అహ్మద్ బాసిల్ చేసిన పొరపాటును ఫ్రాన్స్ సద్వినియోగం చేసుకుంది. డెంబెలే అందించిన పాస్‌ను ఎంబాపె గోల్‌గా మలిచి జట్టుకు రెండో గోల్ అందించాడు. టోర్నీలో అతడికి ఇది నాలుగో గోల్ కావడం విశేషం. 66వ నిమిషంలో మైఖేల్ ఒలిసే ఇచ్చిన అద్భుత పాస్‌ను ఉస్మాన్ డెంబెలే గోల్‌గా మలిచి ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు. చివరి నిమిషాల్లో ఎంబాపెకు హ్యాట్రిక్ సాధించే అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఎంబాపె@16 గోల్స్
ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి, ఎంబాపె మధ్య గోల్స్ పోటీ నడుస్తోంది. ఆస్ట్రియాతో రెండో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో రెచ్చిపోయిన మెస్సి.. ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 18 గోల్స్‌తో మెస్సి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కాగా ఇరాక్‌తో మ్యాచ్‌లో రెండు గోల్స్ కొట్టిన ఎంబాపె.. ప్రపంచ కప్‌లో 16 గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అత్యధిక గోల్స్ కొట్టిన ప్లేయర్ల జాబితాలో ఎంబాపె రెండో స్థానంలో ఉన్నాడు. ఫ్రాన్స్ తన తదుపరి మ్యాచ్ జూన్ 26న నార్వేతో ఆడనుంది. మెస్సి కంటే రెండే గోల్స్ వెనుకంజలో ఉన్న ఎంబాపె.. నార్వేపై ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
