కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచన
కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం): ఓటర్ జాబితాను పకడ్బందీగా, పారదర్శకంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా విజ్ఞప్తి చేశారు.
మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎలఏలు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించి అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు.
జూలై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా, అనర్హులు చేరకుండా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశిస్తూ, ప్రజాప్రతినిధులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్ల సహకారాన్ని వినియోగించనున్నట్లు తెలిపారు. కొత్త ఓటర్ల కోసం ఫారం–6, మార్పులు, చేర్పుల కోసం ఫారం–8 వినియోగించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ స్వామి, ఆర్డీవోలు శర్మిల, జలకుమారి, కాంగ్రెస్ నేత సిరాజ్ హుస్సేన్, బీఆర్ఎస్ నేత సత్తినేని శ్రీనివాస్, బిజెపి నేత నాంపల్లి శ్రీనివాస్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, టిడిపి నేత ఎర్రవెల్లి రవీందర్, బీఎస్పీ నేత సిరిసిల్ల అంజయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
