- 15 లీటర్ల గుడుంబా స్వాధీనం.. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
- ముగ్గురిపై కేసులు నమోదు
మహబూబాబాద్(చైతన్యగళం):
జిల్లాలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాల కట్టడికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దర్గా తండా గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
ఎస్సైలు రాజు, మనోహర్ ఆధ్వర్యంలో ఏఎస్సైలు ఎండీ జాకీర్, రమేష్, హెడ్ కానిస్టేబుల్ రాజగోపాల్‌తో పాటు పోలీసు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
