- మానుకోట రైల్వే ప్రయాణికుల సమస్యపై ఐక్య పోరాటానికి శంతన్ రామరాజు పిలుపు
మహబూబాబాద్(చైతన్యగళం):
మహబూబాబాద్ (మానుకోట) రైల్వే స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ఐక్యంగా ఉద్యమించాలని శంతన్ రామరాజు పిలుపునిచ్చారు. సుమారు రూ.40 కోట్లతో రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నప్పటికీ నాలుగో ప్లాట్‌ఫామ్ నిర్మాణాన్ని పక్కనపెట్టి అడ్డుగోడ నిర్మించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
నాలుగో ప్లాట్‌ఫామ్ లేకపోవడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దివ్యాంగులు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు మెట్ల మార్గంలో రాకపోకలు సాగించడం కష్టసాధ్యంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాలుగో ప్లాట్‌ఫామ్ నిర్మాణానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మానుకోట ప్రజలు తలచుకుంటే సాధించలేనిదేమీ లేదని, రైల్వేశాఖ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కుల, విద్యార్థి, ప్రజా, వ్యాపార సంఘాల ప్రతినిధులు ఈ సమస్యపై స్పందించి ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. చిన్నచిన్న సమస్యలపై స్పందించే నాయకులు, నాలుగో ప్లాట్‌ఫామ్ వంటి కీలక ప్రజా సమస్యపై ఎందుకు గళమెత్తడం లేదని ప్రశ్నించారు.
సుమారు ఏడాదిన్నర క్రితమే తాను ఈ సమస్యను గుర్తించి తొలిసారిగా ప్రజల దృష్టికి తీసుకువచ్చానని, అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం ఈ అంశంపై జోక్యం చేసుకున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, ప్రస్తుతం దీనిపై ప్రజా ఉద్యమం అవసరమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఉద్యమం, మహబూబాబాద్ జిల్లా సాధన ఉద్యమాల సమయంలో పాత్రికేయులు అందించిన ప్రచారం, సహకారం మరువలేనివని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా నాలుగో ప్లాట్‌ఫామ్ నిర్మాణం కోసం ప్రజలను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేసే బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు.
రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగానే నాలుగో ప్లాట్‌ఫామ్ నిర్మాణానికి ప్రాధాన్యత కల్పించి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని శంతన్ రామరాజు కోరారు.
