- విద్యార్థులు తమ శాస్త్రీయ ప్రతిభను చాటుకోవాలి: అదనపు కలెక్టర్ కె. అనిల్‌కుమార్
మహబూబాబాద్, నవంబర్ 2(చైతన్యగళం):
విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా దృక్పథం, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ నెల 12న జిల్లాస్థాయి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి కె. అనిల్‌కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని పిలుపునిచ్చారు.
సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో సైన్స్ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు నిర్వహించే సైన్స్ సంబరాల్లో విద్యార్థులు విస్తృతంగా పాల్గొనాలని సూచించారు. తమలోని సృజనాత్మకతను, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రదర్శించి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయిలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంపిక చేసి పంపించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఏసీజీ శ్రీరాములు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు సాహితి శ్రీనివాస్, అధ్యక్ష, కార్యదర్శులు ఏకాంబరం, సురేష్, సీనియర్ నాయకులు మంగపతిరావు, బ్రహ్మం, చొప్పరి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, జంపాల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.

