- ఎకరాకు రూ.70 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్
శంకరపట్నం, అక్టోబర్ 24 (చైతన్యగళం): విత్తనాల వైఫల్యంతో పంట నష్టపోయామని, తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లాకు చెందిన సుమారు 40 మంది రైతులు శనివారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఓ విత్తనోత్పత్తి కేంద్రం ఎదుట ఆందోళన నిర్వహించారు.
గత రబీ సీజన్లో సదరు కంపెనీ అందించిన ఆడ, మగ వరి విత్తనాలను సాగు చేయగా పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. ఈ విషయంపై కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరపగా, ఎకరాకు రూ.70 వేల చొప్పున పరిహారం చెల్లించేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. పండిన ధాన్యాన్ని సైతం కంపెనీ యాజమాన్యం తీసుకుందని వెల్లడించారు.
అయితే, పరిహారం చెల్లించేందుకు అంగీకరించి చాలా కాలం గడిచినా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు వెంటనే పరిహారం అందేలా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు.
