Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచి చిట్యాల బాబు

గ్రామాభివృద్ధే లక్ష్యంగా సర్పంచి చిట్యాల బాబు

📰 Generate e-Paper Clip

  • బతుకమ్మ ఘాట్‌ శుభ్రతకు స్వయంగా రంగంలోకి.. జేసీబీతో పనులు

హుస్నాబాద్ , అక్టోబర్ 10 (చైతన్యగళం):

గ్రామాభివృద్ధే ధ్యేయంగా ఆరేపల్లి సర్పంచి చిట్యాల బాబు ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు ఆలస్యం కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ, జేసీబీతో పనులు చేపడుతున్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ తనదైన శైలిలో సేవలందిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ఆరేపల్లి గ్రామంలోని బతుకమ్మ ఘాట్‌ వద్ద మహిళలు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన సర్పంచి.. పరిసరాలను శుభ్రం చేసి, చెరువులోకి దిగేందుకు వీలుగా మార్గాన్ని సులభతరం చేసే పనులు చేపట్టారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మలను నిమజ్జనం చేసుకునేలా ఘాట్‌ను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు.

మంత్రి సీతక్క హామీ మేరకు గ్రామంలో పారిశుద్ధ్య పనులతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, రహదారులపై కనిపించేలా సూచికల ఏర్పాటు, వీధి దీపాల కల్పన వంటి అవసరమైన సౌకర్యాలపైనా దృష్టి సారిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇందుకోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సాధారణంగా గ్రామాల్లో అభివృద్ధి పనులను సిబ్బంది ద్వారా చేపడుతుంటారు. అయితే ఆరేపల్లి సర్పంచి చిట్యాల బాబు పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తుండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. పదవిని కేవలం హోదాగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ప్రజలకు ఉపయోగపడే పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

బతుకమ్మ ఘాట్‌ శుభ్రతతో పాటు గ్రామంలో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తూ మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సర్పంచి చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆరేపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సర్పంచి చిట్యాల బాబు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!