మహబూబాబాద్, అక్టోబర్ 8(చైతన్యగళం): అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, అవయవ దానంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా అవయవదాతల సంఘం అధ్యక్షుడు, లయన్ పరకాల రవీందర్‌రెడ్డి అన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ మాన్యత ఆధ్వర్యంలో నేత్ర, రక్త, అవయవ, మరణానంతర శరీర దానాల ప్రాధాన్యతపై గురువారం మానుకోట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్లబ్ అధ్యక్షురాలు వేలూరి శ్యామలాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల రవీందర్‌రెడ్డి హాజరై మాట్లాడారు.
అవయవ దానం ద్వారా అవయవాలు పనిచేయని పలువురు రోగులకు ప్రాణదానం చేయవచ్చని, మరణానంతరం నేత్రాలు, అవయవాలు, మృతదేహాన్ని దానం చేయడం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా పలువురికి అవయవ దానానికి సంబంధించిన అంగీకార పత్రాలను అందజేశారు. ఆలయ వాచ్‌మన్ జాటోత్ భద్రు మరణానంతరం తన మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేసేందుకు ముందుకు వచ్చి అంగీకార పత్రాన్ని లయన్స్ క్లబ్ ప్రతినిధులకు అందజేశారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి బండి అరుణ, కోశాధికారి పరకాల కళావతి, సభ్యులు రంగవజ్జుల సునీత, వడ్డేపల్లి సునీత, పరకాల లక్ష్మి, రూపిరెడ్డి శ్రీలత, కైరంకొండ విజయ, ఏ.స్వర్ణ, కైరంకొండ లలితతో పాటు జిల్లా వాణి, పరకాల శ్రీదేవి, కే.సజితాదేవి, పరకాల పద్మ, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
