- ‘భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే’గా భారీ నిరసన ర్యాలీ
- బీజేపీ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో ప్రదర్శన
మహబూబాబాద్, అక్టోబర్ 8(చైతన్యగళం):భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ‘ఓట్ చోరీ’ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నాయకులు, INDIA కూటమి ఎంపీలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం, లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. ప్రతిపక్ష నాయకులపై దాడులు ఆపాలి.. అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఎడ్ల రమేష్, మహమ్మద్ ఖలీల్, బెల్లంకొండ శ్రీనివాస్, గుగులోతు వెంకట్, ఎండి అరుణ్, బోడ రవి, సల్వాదే దిలీప్, గిరిదర్ గుప్త, నాళ్ల నరసింహారావు, నీరుటి సురేష్, నీరుటి లక్ష్మీ నారాయణ, రామగోని రాజు గౌడ్, రంజిత్ శంకర్, గోనె శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
