- రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శలు
కరీంనగర్, అక్టోబరు 2 (చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు, ఎరువులు, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రైతుబంధు, రుణమాఫీ అమలుపైనా అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేత, పవర్లూమ్ రంగానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం ప్రస్తుతం లేదని, బతుకమ్మ చీరల ఆర్డర్లు, గత బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని అన్నారు. భూ ఆక్రమణలు, హైడ్రా, ప్రాజెక్టుల పునఃరూపకల్పనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు కొనసాగింపు, అంబేద్కర్ అభయహస్తం పథకాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
సిరిసిల్లలో పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమలును కూడా ఆయన తప్పుబట్టారు. ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలకు బదులుగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి ఎన్నికల హామీలను అమలు చేయాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
