Monday, September 21, 2026
Homeతెలంగాణబీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష

బీసీ సంక్షేమ శాఖపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమీక్ష

📰 Generate e-Paper Clip

  • ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ దరఖాస్తులపై సమీక్ష.. గురుకులాలకు సొంత భవనాలపై దృష్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (చైతన్యగళం): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ సోమవారం మంత్రుల నివాస సముదాయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం దరఖాస్తుల స్వీకరణ, అమలు, బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై చర్చించారు.

కుట్టు మిషన్ల పథకానికి ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన బీసీ మహిళలకు ప్రయోజనం అందేలా ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, బీసీ హాస్టళ్ల పనితీరుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు, విద్యార్థులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

విద్యా ప్రమాణాల మెరుగుదల, మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు, డిజిటల్‌ విద్య, ఉన్నత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు.

21 గురుకులాలకే సొంత భవనాలు

రాష్ట్రంలో 327 బీసీ గురుకుల పాఠశాలలు ఉండగా.. ప్రస్తుతం 21 పాఠశాలలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో సొంత భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని గుర్తించాలని మంత్రి ఆదేశించారు. స్థలం అందుబాటులో ఉన్న గురుకులాలకు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బీసీ విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా నైపుణ్యాభివృద్ధి, పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గురుకులాలు, హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బాల మాయాదేవి, అధికారులు మల్లయ్య బట్టు, అలోక్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!