- వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలి: ప్రభుత్వ విప్ విజయరమణరావు
పెద్దపల్లి, సెప్టెంబరు 21 (చైతన్యగళం): వినాయక నిమజ్జన వేడుకలకు పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద మున్సిపల్ చైర్మన్, కమిషనర్, పోలీసు అధికారులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయరమణరావు మాట్లాడుతూ.. నిమజ్జన వేడుకలను భక్తులు ప్రశాంతంగా నిర్వహించుకునేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అధికారులు భక్తులకు అందుబాటులో ఉంటూ నిమజ్జన కార్యక్రమాలను సజావుగా నిర్వహించాలని కోరారు.
అనంతరం పట్టణంలోని పలు వినాయక మండపాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించిన ఆయన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, అధికారులు, పోలీసు సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
