- ఇళ్ల నిర్మాణం, మరమ్మతులకు తక్కువ వడ్డీకే రుణాలు
పెద్దపల్లి, సెప్టెంబరు 21 (చైతన్యగళం): ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక గృహ రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. రీజినల్ హెడ్ కె.నటరాజ్ సూచనల మేరకు పెద్దపల్లి జెండా రోడ్డులోని బ్యాంకు శాఖలో సోమవారం పథకంపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రిటైల్ రుణ విభాగం అధిపతి సంతోష్ మాట్లాడుతూ.. అర్హులైన వారికి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. నూతన గృహ నిర్మాణంతో పాటు ఇళ్ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు కూడా రుణ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జన్-సమర్థ్ అంతర్జాల వేదిక ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
రుణ అర్హతలు, ఇతర వివరాల కోసం సమీపంలోని యూనియన్ బ్యాంక్ శాఖ లేదా రిటైల్ రుణ విభాగాన్ని సంప్రదించాలని కోరారు. సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్, బ్రాంచ్ మేనేజర్ వైకుంఠరావు, బ్యాంకు సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
