హైదరాబాద్, ఆగస్టు 31(చైతన్యగళం): రాష్ట్రంలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలో నర్స్ హత్య ఘటనపై ఆయన సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ దారుణ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందన్నారు. హత్య అనంతరం అత్యాచారం జరిగినట్లు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, శాంతిభద్రతలు క్షీణించాయని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజల ఆస్తులకే కాకుండా ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. హోం శాఖను కూడా నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. పరిస్థితులు ఇంత దారుణంగా మారుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
‘ఇంకెంత మంది ఆడబిడ్డలు బలైతే ప్రభుత్వం మేల్కొంటుంది? మహిళలకు భద్రత కల్పించలేని మీకు హోం శాఖ నిర్వహించే నైతిక హక్కు ఉందా?’ అని నిలదీశారు.
నర్స్ హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన కోరారు.
