Sunday, August 30, 2026
Homeతెలంగాణరైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి - సీఎం రేవంత్‌రెడ్డి

రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి – సీఎం రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

  • సీఎం రేవంత్‌రెడ్డితో రైతు కమిషన్‌ బృందం భేటీ
  • మైనర్‌ ఇరిగేషన్‌ నివేదిక అందజేత.. రెండేళ్ల ప్రగతిపై చర్చ

హైదరాబాద్‌, ఆగస్టు 29 (చైతన్యగళం‌): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రైతు కమిషన్‌ బృందం విస్తృతంగా చర్చించింది. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం జరిగిన ఈ సమావేశం రెండు గంటలకు పైగా కొనసాగింది.

ఈ సందర్భంగా రైతు కమిషన్‌ రూపొందించిన మైనర్‌ ఇరిగేషన్‌ నివేదికను కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. రాష్ట్రంలోని చిన్నతరహా సాగునీటి వనరులు, వాటి అభివృద్ధి, రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సీఎంకు వివరించారు.

రెండేళ్లలో కమిషన్‌ చేపట్టిన కార్యక్రమాలు, రైతుల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషి, ప్రభుత్వానికి అందించిన సలహాలు, సూచనలను కమిషన్‌ చైర్మన్‌, సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతాంగ సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారానికి కమిషన్‌ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

కమిషన్‌ పనితీరుపై సీఎం సంతృప్తి

రైతు కమిషన్‌ పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పాటు, రైతాంగానికి అండగా కమిషన్‌ పనిచేస్తోందని అభినందించారు. ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అర్హులైన ప్రతి రైతుకూ చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

రైతుల ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైతు కమిషన్‌ నుంచి అవసరమైన సహకారం, సూచనలు అందించాలని సీఎం కోరినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డితో పాటు సభ్యులు కేవీఎన్‌ రెడ్డి, రాములు నాయక్‌, గోపాల్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, భవానీ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!