- ఖోఖో, టగ్ ఆఫ్ వార్ పోటీలు.. విజేతలకు బహుమతులు ప్రధానం
సుల్తానాబాద్, ఆగస్టు 29 (చైతన్యగళం):
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్ ఖేల్ ఇండియా సెంటర్‌లో శనివారం ఖోఖో, టగ్ ఆఫ్ వార్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో రెండో రోజు పోటీలు కొనసాగాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు.
పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ. సురేష్, సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అంతటి పుష్పలత మాట్లాడుతూ, విద్యార్థులు, యువత రోజువారీ జీవితంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తిని పెంచుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
మేజర్ ధ్యాన్‌చంద్ వంటి క్రీడా దిగ్గజాల స్ఫూర్తితో యువత క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, కార్యదర్శి అమీరిశెట్టి తిరుపతి, మున్సిపల్ కౌన్సిలర్లు గాజుల రాజమల్లు, వర ప్రదీప్, అబ్బాయి గౌడ్, కందుకూరి కుమార్, కోచ్ గెల్లు మధుకర్, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేష్, సత్యం, అజ్జు, శివ, సంధ్య, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
