- సెప్టెంబర్ 1 నుంచి ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలకు స్వస్తి
- టీ-స్వాన్‌ను నెల రోజుల్లో టీ-ఫైబర్‌కు బదిలీ చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్(చైతన్యగళం): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 1 నుంచి టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందేలా చర్యలు పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఆ తేదీ తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తూ బిల్లులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో టీ-ఫైబర్ సేవల విస్తరణపై మంగళవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి నిర్ణీత గడువులోగా టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ నిధుల ఆదాతో పాటు అన్ని శాఖలకు ఏకీకృత డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న టీ-స్వాన్ (T-SWAN) నెట్‌వర్క్‌ను వచ్చే నెల రోజుల్లో పూర్తిగా టీ-ఫైబర్‌కు మార్చాలని సంబంధిత అధికారులకు గడువు విధించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీకి అత్యాధునిక టీ-ఫైబర్ కనెక్టివిటీ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇంటర్నెట్’ కార్యక్రమాన్ని వేగవంతం చేసి గ్రామీణ ప్రాంతాల వరకు నాణ్యమైన బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గడువులోగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.
