సిద్దిపేట, ఆగస్టు 24 (చైతన్యగళం):
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హైమావతి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టం, వైద్య సంస్థల చట్టంపై జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాల నిర్వహణపై వివరాలు అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్కానింగ్, రోగ నిర్ధారణ కేంద్రాల యాజమాన్యాలు గర్భస్థ శిశువు ఆడా, మగా అని నిర్ధారించే పరీక్షలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు స్కానింగ్, రోగ నిర్ధారణ కేంద్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలు కొత్తగా నమోదు చేసుకోవాలంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించి తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. జిల్లా జడ్జి సుదర్శన్ మాట్లాడుతూ అన్ని ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ నిషేధ చట్టానికి సంబంధించిన రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశాల్లో ఆసుపత్రులకు సంబంధించిన వివరాలను కమిటీ ముందు ఉంచాలని సూచించారు వైద్య సంస్థల చట్టం-2010ను అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. నమోదు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, డీఆర్వో నాగరాజమ్మ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
