హుస్నాబాద్ రూరల్, నవంబర్ 26 (చైతన్యగళం): మాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత రాజు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు భరోసానిస్తూ, ఆపద సమయంలో అండగా నిలుస్తున్నాయని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ ప్రజలకు మేలు చేస్తున్న మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ ఎంపీఓ రమేష్, పంచాయతీ కార్యదర్శి దివ్య, వార్డు సభ్యుడు బత్తుల వీరస్వామి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

