- రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులంతా సంఘటితం కావాలి: వెన్న రాజు
హుస్నాబాద్, నవంబర్ 26 (చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆరె కిశోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులతో కలిసి పట్టణంలో రాజ్యాంగ పరిరక్షణ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం భిన్న మతాలు, కులాలు, వర్గాలతో కూడిన భారతదేశాన్ని ఐక్యంగా నడిపించేందుకు రాజ్యాంగం అవసరమని ఆనాటి పెద్దలు గుర్తించారని తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించి, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ రాజ్యాంగ రూపకల్పనలో విశేష కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించినందున దేశవ్యాప్తంగా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని వివరించారు.
దేశంలో ఇప్పటికీ అనేక వర్గాలు రాజ్యాంగం కల్పించిన హక్కులకు దూరంగా పేదరికంలో జీవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తూ, దాన్ని మార్చి మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘటితమై రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా మీడియా ఇన్చార్జి జాల శ్రీనివాస్, హుస్నాబాద్ జై భీమ్ సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు దుండ్ర సుమన్, మండల నాయకులు సుంకే రమేష్, నోముల బాలయ్య, డ్యాగాల సతీష్, సావుల రమేష్, సుంకే సంపత్, గద్ద శ్రీనివాస్, డ్యాగాల మహేందర్, జాల రాజు, భోజ అనిల్, మేదిని ఆంజనేయులు, సుంకే కుమార్, జాల సాయి, పున్న సాయి శివ, నాలువల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

