- దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు సహకరిస్తానని టాస్క్ సీఓఓ హామీ
కడ్తాల్, నవంబర్ 14 (చైతన్యగళం):
కొండ్రిగానీ బోర్డు తండావాసుల ఆధ్యాత్మిక ఆకాంక్షకు అండగా నిలిచేందుకు టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి ముందుకు వచ్చారు. తండాలో హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులు సగంలోనే నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
తండావాసుల విజ్ఞప్తి మేరకు నిర్మాణ పనులు నిలిచిపోయిన హనుమాన్ దేవాలయాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంపై స్పందించిన ఆయన, దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
దేవాలయ నిర్మాణానికి సహకరించేందుకు ఆయన ముందుకు రావడంపై తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం ఇస్తూ సహకారం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తికి స్పందించి ఆలయ నిర్మాణానికి చేయూతనిస్తానని హామీ ఇచ్చినందుకు సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బనావత్ శారద బిక్కు నాయక్, ఉపసర్పంచ్ సభావత్ యశోద రాజు నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, తండావాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

