హుస్నాబాద్, నవంబర్ 9 (చైతన్యగళం):
రేషన్ డీలర్లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, ప్రతి క్వింటాల్‌కు రూ.300 కమిషన్ చెల్లించాలని కోరుతూ రేషన్ డీలర్ల ప్రతినిధులు రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేశారు. సోమవారం హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా డీలర్ల ప్రతినిధులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చిందని, పార్టీ అధికారంలోకి రావడంలో డీలర్లు సైతం తమ వంతు కృషి చేశారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం, కమిషన్‌ను వెంటనే పెంచాలని కోరారు.
వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందిస్తూ, రేషన్ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఆ లేఖ ప్రతిని డీలర్లకు అందజేస్తానని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం, కమిషన్ పెంపు అంశంపై సంబంధిత వర్గాలతో చర్చిస్తానన్నారు.
త్వరలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి రేషన్ డీలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని, నియోజకవర్గంలోని ప్రతి డీలర్ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. డీలర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర కోశాధికారి వంగరి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, యాదగిరి చిగురు అధ్యక్షుడు తాళ్లపల్లి భాస్కర్, చిగురుమామిడి మండల అధ్యక్షుడు తిరుపతి, అక్కన్నపేట అధ్యక్షుడు రమేష్, కోహెడ అధ్యక్షులు రమాదేవి, ప్రభాకర్‌రెడ్డి, రాజన్న, సలీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రేషన్ డీలర్లు హాజరయ్యారు.
