- మెస్, సౌందర్య సాధనాల ఛార్జీలు పెంచాలి: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
హుజూరాబాద్, అక్టోబర్ 28 (చైతన్యగళం): జమ్మికుంట బీసీ సంక్షేమ హాస్టల్‌కు నూతన సొంత భవనం నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఒకే గదిలో సుమారు 30 మంది విద్యార్థులు నిద్రించాల్సిన పరిస్థితి ఉందని, తలుపులు, కిటికీలు సైతం సరిగా లేవని తెలిపారు. గత మూడేళ్లలో హాస్టల్‌ను మూడు వేర్వేరు ప్రైవేటు భవనాలకు మార్చాల్సి వచ్చిందన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్, సౌందర్య సాధనాల ఛార్జీలు పెంచాలని, చలికాలం దృష్ట్యా విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని కోరారు.
జమ్మికుంటలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్టల్‌ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు రత్నం సురేష్, నాయకులు ఆదిత్య, నిఖిల్, మనోజ్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
