Wednesday, October 28, 2026
Homeతెలంగాణకరీంనగర్హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

  • బండి సంజయ్‌, పొన్నం ప్రభాకర్‌ చొరవ తీసుకోవాలి: కవ్వ వేణుగోపాల్‌ రెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 28 (చైతన్యగళం):

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ హుస్నాబాద్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో ఈ మూడు మండలాలకు చోటు దక్కలేదని పేర్కొంటూ, వాటిని కూడా కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించేందుకు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్‌ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి మూడు మండలాల్లో నెలకొన్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హత ఆధారంగా కరువు ప్రాంతాల జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు.

హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు లేకపోవడంతో రైతులు ప్రధానంగా వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారని వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. తగిన వర్షపాతం లేకపోవడంతో బోర్లు, బావులు ఎండిపోయాయని, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో సాగుతోపాటు తాగునీటి అవసరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని, గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. వర్షపాతం లోటు, పంటల పరిస్థితి, భూగర్భ జలాల స్థాయి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అర్హత ఉన్న మూడు మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నిబంధనల ప్రకారం తగిన సహాయం అందించి, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!