- భాయీజీ ఆశయాలు యువతకు మార్గదర్శకం.. దేశసేవ, మానవతా విలువలు ఆయన జీవిత సందేశం
కరీంనగర్, అక్టోబర్ 25 (చైతన్యగళం): ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ‘చంబల్ గాంధీ’గా పేరుగాంచిన డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు భాయీజీ ఐదో వర్ధంతి సందర్భంగా కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. నగరపాలక సంస్థ పరిధిలోని తీగలగుట్టపల్లిలో ఉన్న మేయర్ శిబిర కార్యాలయంలో ఆదివారం భాయీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న వర్ధంతి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డాక్టర్ ఎస్.ఎన్. సుబ్బారావు తన జీవితాన్ని దేశసేవకు, యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడానికి అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. కేవలం 13 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన, స్వాతంత్ర్యం అనంతరం గాంధేయ సిద్ధాంతాల స్ఫూర్తితో సమాజ సేవకు అంకితమయ్యారని గుర్తుచేశారు.
చంబల్ లోయల్లో బందిపోట్లుగా జీవించిన వారిని అహింసా మార్గంలోకి తీసుకువచ్చి, జనజీవన స్రవంతిలో కలిసేలా కృషి చేసిన గొప్ప మానవతావాది భాయీజీ అని మేయర్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ సేవా ఆశ్రమాన్ని స్థాపించి, వారికి పునరావాసం కల్పించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్ వంటి ప్రముఖుల స్ఫూర్తితో శాంతి, అహింస, మానవతా విలువలను సమాజంలో పెంపొందించేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు.
యువతే దేశానికి వెన్నెముక అనే విశ్వాసంతో నేషనల్ యూత్ ప్రాజెక్ట్‌ను స్థాపించి, గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయుల వరకు యువజన శిబిరాలు నిర్వహించారని మేయర్ వివరించారు. జాతీయ సమైక్యత, సమగ్రత, మతసామరస్య పరిరక్షణతోపాటు ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించారని పేర్కొన్నారు.
పద్మశ్రీ, పద్మవిభూషణ్ వంటి పురస్కారాలను స్వీకరించకుండా నిరాడంబర జీవనానికి, సేవా మార్గానికి ప్రాధాన్యమిచ్చిన త్యాగశీలి భాయీజీ అని మేయర్ కొనియాడారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటూ 94 ఏళ్ల వయసులోనూ దేశసేవకే అంకితమైన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. భాయీజీ మార్గదర్శకత్వంలో తాను కూడా దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి విలువలను అలవర్చుకున్నానని, ప్రజాసేవలో ముందుకు సాగేందుకు ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. భాయీజీ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నేషనల్ యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కే. యాదవ రాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు భాయీజీ వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఆంగ్లభాష వనరుల వ్యక్తి గడ్డం జగదీష్, మై భారత్ కరీంనగర్ మాజీ కార్యక్రమ సమన్వయకర్త రవీందర్, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, గాండ్ల నరేష్, వడ్డేపల్లి రాజు, కొలగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. భాయీజీ సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.
