- అధికారులను ఆదేశించిన కలెక్టర్ చిత్రా మిశ్రా
- నిమజ్జన ప్రాంతాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
కరీంనగర్, అక్టోబర్ 13 (చైతన్యగళం):
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు కరీంనగర్ నగరంలోనూ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మహిళా అభివృద్ధి, మెప్మా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అంగన్‌వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులను భాగస్వాములను చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల అధికారులు పారిశుద్ధ్యం, వీధి దీపాల ఏర్పాటు తదితర పనులను చేపట్టాలని ఆదేశించారు. బతుకమ్మ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
పోలీసు, వైద్య ఆరోగ్య, యువజన క్రీడల శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో అన్ని వసతులు
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగరంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. మానేరు నది, మానకొండూర్, కొత్తపల్లి ప్రాంతాలు, చెరువులు, చింతకుంట, కాకతీయ కాలువ పరిసరాల్లో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు చేపడతామని వివరించారు. బతుకమ్మ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
