సిరిసిల్ల , సెప్టెంబర్ 19 (చైతన్య గళం):
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలకు కాలువలు, చెరువుల్లో నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎస్సారెస్పీ పరిధిలోని కాలువల్లో నీళ్లు లేవని, ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సీఎం వెంటనే జోక్యం చేసుకుని కాలువలకు నీళ్లు విడుదల చేయాలని కోరారు. పరిస్థితి చేయి దాటకముందే నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించాలని సూచించారు.
హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని, కాలువలకు నీళ్లు విడుదల చేయకపోతే వినాయక విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిమజ్జనోత్సవాలు విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదని బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ కబ్జా చేసిందనే ఆరోపణలకు ఆధారాలు చూపాలని, ఆధారాలు ఉంటే ఆ భూములను తామే రక్షించి పేదలకు పంచుతామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల భూదోపిడీకి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు బయటపెట్టాలని, లేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య రాజకీయ డ్రామాలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. ఆరు గ్యారంటీలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చ లేకుండా అసెంబ్లీలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, మహారాష్ట్ర తర్వాత అత్యంత వైభవంగా నిమజ్జనోత్సవాలు తెలంగాణలోనే జరుగుతున్నాయని అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తియుత వాతావరణంలో ఉత్సవాల్లో పాల్గొనాలని, తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అధికారులకు సహకరించాలని కోరారు.
