కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం):
ఈ నెల 23న నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాల అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మానకొండూర్, కొత్తపల్లి, చింతకుంట, గోపాల్‌పూర్, దుర్షేడ్, బొమ్మకల్ తదితర నిమజ్జన పాయింట్ల వద్ద భారీ కేడ్లు, సీసీ కెమెరాలు, క్రేన్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, విద్యుత్ లైటింగ్, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని కేటాయించి పరిశుభ్రతను పర్యవేక్షించాలని, నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. షిఫ్టుల వారీగా విధులు కేటాయించి నిమజ్జనం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కమిషనర్ ఆయాజ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు.
