కల్వకుర్తి, సెప్టెంబర్ 18 (చైతన్యగళం):
గణేష్ మండపం వద్ద విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని గాంధీనగర్ మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
తర్ణికల్ గ్రామానికి చెందిన జంపుల అరవింద్ (23) విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికుల వివరాల మేరకు తెలుస్తోంది. వర్షం కారణంగా మండపం వద్ద ఏర్పాటు చేసిన తోరణాలు కిందపడటంతో వాటిని పక్కకు తొలగించే ప్రయత్నంలో అరవింద్‌కు విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. వెంటనే అతడిని సీబీఎం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అరవింద్‌ను రక్షించే ప్రయత్నంలో మరో యువకుడికి కూడా విద్యుత్ షాక్ తగిలినట్లు స్థానికులు తెలిపారు. అరవింద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు అధికారుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
అరవింద్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, కల్వకుర్తిలో సెలూన్ నిర్వహిస్తూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. అతడి మృతితో తర్ణికల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
