- హరీశ్‌రావు బంధువుకు చెందినవిగా పేర్కొంటున్న అసైన్డ్ భూముల పరిశీలన
రికార్డులు, పహాణీలు.. బదలాయింపుపై అధికారులను ప్రశ్నించిన ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం
సిద్ధిపేట, సెప్టెంబర్ 18 (చైతన్యగళం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల నేపథ్యంలో కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని అసైన్డ్ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం శుక్రవారం ఆరా తీసింది. గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో 6 ఎకరాల 2 గుంటల విస్తీర్ణంలో ఉన్న అసైన్డ్ భూములను బృందం పరిశీలించింది.
ఈ భూములు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు బంధువు హనుమంతరావుకు చెందినవిగా పేర్కొంటున్న నేపథ్యంలో భూములకు సంబంధించిన పూర్తి వివరాలను బృందం సేకరించింది. కొండపాక తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డిని కలిసి భూముల రికార్డులు, పహాణీలు, పట్టాదారు వివరాలపై ప్రశ్నించింది.
భూముల కొనుగోలు, యాజమాన్య హక్కులు, అసైన్డ్ భూముల బదలాయింపునకు సంబంధించిన అంశాలపై ప్రతినిధి బృందం అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంది. అసైన్డ్ భూముల బదలాయింపు జరిగిందా? నిబంధనలకు అనుగుణంగా లావాదేవీలు సాగాయా? అనే అంశాలపై రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.
హరీశ్‌రావు బంధువుకు చెందినవిగా పేర్కొంటున్న భూములపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టడంతో వెలికట్ట భూముల వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
