దేవరకొండ, సెప్టెంబరు 14 (చైతన్యగళం): వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ రాష్ట్ర నాయకులు కేతావత్ లాలూనాయక్ శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి కేవలం పండుగ మాత్రమే కాదని, చెడు ఆలోచనలను విడనాడి మంచి మార్గంలో నడవాలని చాటిచెప్పే ఆధ్యాత్మిక సందేశమని పేర్కొన్నారు.
గణనాథుడి రూపం మనకు ఎన్నో విలువైన జీవిత పాఠాలను అందిస్తుందని తెలిపారు. పెద్ద చెవులు ఇతరుల మాటలను ఓపికగా వినాలని, చిన్న కళ్లు ఏకాగ్రతతో ముందుకు సాగాలని సూచిస్తాయని చెప్పారు. ఏ శుభకార్యాన్ని ప్రారంభించినా ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ అని, ఆయన ఆశీస్సులతో ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసమన్నారు.
జ్ఞానం, విజయం, ఐశ్వర్యం, శుభాన్ని ప్రసాదించే గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్ర పర్వదినమే వినాయక చవితి అని లాలూనాయక్ పేర్కొన్నారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
