- ఎంఈఓ కార్యాలయం ఎదుట పీడీఎస్‌యూ ధర్నా.. వినతిపత్రం అందజేత
నందికొట్కూరు, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని శ్రీ నవనంది హైస్కూల్‌పై చర్యలు తీసుకొని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బుధవారం ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పాఠశాలలోని సమస్యలను వివరిస్తూ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి బోయ సాయి, డివిజన్ అధ్యక్షులు ఆసిఫ్ అహ్మద్ మాట్లాడుతూ శ్రీ నవనంది హైస్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులకు మించి ‘బల్క్ అమౌంట్’ పేరుతో పాఠశాల ఫీజులు, పుస్తకాలు, వ్యాన్, వసతి గృహం తదితర చార్జీల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీస మౌలిక వసతులైన మరుగుదొడ్లు, ఆటస్థలం, విశాలమైన తరగతి గదులు అందుబాటులో లేవని పేర్కొన్నారు.
పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడకుండా పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఫీజులకు సంబంధించిన వివరాలను పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉన్నప్పటికీ అలా చేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అర్హత లేని ఉపాధ్యాయులను తక్కువ వేతనాలకు నియమించుకొని విద్యార్థులకు బోధిస్తున్నారని, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఆదివారాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పాఠశాల ఒకే భవనంలో నిర్వహించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ వేర్వేరు భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే శ్రీ నవనంది హైస్కూల్ గుర్తింపును రద్దు చేయాలని పీడీఎస్‌యూ నాయకులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ధర్నాలో పీడీఎస్‌యూ డివిజన్ సహాయ కార్యదర్శులు, ఉపాధ్యక్షులు ఫిరోజ్, పురుషోత్తం, లక్ష్మీకాంతరెడ్డి, ఉస్మాన్, రాజు, మౌలాలి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
