పెద్దపల్లి, సెప్టెంబర్ 7 (చైతన్యగళం):
ఎస్సీ, ఎస్టీల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఐక్యంగా పోరాడాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన ఘటన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎంపీల సమావేశం సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగింది. సమావేశానికి ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంట్ సభ్యుల ఫోరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హల్ద్వానీలో ఖర్గే పర్యటన అనంతరం చోటుచేసుకున్నట్లు పేర్కొంటున్న శుద్ధీకరణ ఘటనపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్ష, అవమానకర వైఖరిని సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించారు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై కూడా ఎంపీ వంశీకృష్ణ స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన కేటీఆర్ బయట ధర్నాలు, ఆందోళనలకు పరిమితం కావడం సరికాదన్నారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లతో దురుసుగా వ్యవహరించడాన్ని ఖండించారు. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని, దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల విషయంలో ద్వంద్వ వైఖరి వీడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు, గౌరవం, సామాజిక న్యాయం కోసం తమ పోరాటం కొనసాగుతుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.
