A2 నిర్దోషిగా విడుదల.. రూ.3 వేల జరిమానా కరీంనగర్, ఆగస్టు 21 (చైతన్య గళం): దేశ్రాజ్‌పల్లి గ్రామంలో 2023 మార్చి 13న జరిగిన మామిడిపల్లి అనిత (50) హత్య కేసులో నిందితుడు A1 తాడగొండ దామోదర్ (34)కు పీడీజే కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో నిందితుడు A2 జాంబోజి శివకుమార్ (23)ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మృతురాలు పగటి సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకున్న తాడగొండ దామోదర్, తనకు డబ్బు అవసరముందని, రూ.30 వేల అప్పుగా ఇవ్వాలని అనితను కోరాడు. ఆమె డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో, ఆమెను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకోవాలని నిందితులు పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2023 మార్చి 13న మృతురాలి ఇంటికి వెళ్లిన A1 దామోదర్, A2 శివకుమార్ ఆమెను హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను తీసుకుని పరారైనట్లు ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు పకడ్బందీగా ఆధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్యాల ప్రతాప్ వాదనలు వినిపించారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగగా, కోర్టు డ్యూటీ అధికారి శ్రీధర్, రామడుగు ఏఎస్సై సత్తయ్య, సీఎంఎస్ సిబ్బంది తదితరులు సమన్వయంతో విధులు నిర్వహించారు. కేసును విచారించిన పీడీజే కోర్టు న్యాయమూర్తి ఎస్. శివకుమార్ తీర్పు వెలువరించారు. A1 తాడగొండ దామోదర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.3 వేల జరిమానా విధించగా, A2 జాంబోజి శివకుమార్‌ను నిర్దోషిగా విడుదల చేశారు. నేర నిరూపణకు సమర్థవంతమైన దర్యాప్తు, పకడ్బందీ ఆధారాల సేకరణకు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అభినందించారు.
