Thursday, September 10, 2026
Homeసంపాదకీయండంపింగ్‌ యార్డుతో కరీంనగర్‌ ప్రజల ఆరోగ్యానికి ముప్పు

డంపింగ్‌ యార్డుతో కరీంనగర్‌ ప్రజల ఆరోగ్యానికి ముప్పు

📰 Generate e-Paper Clip

  • నగరానికి దూరంగా తరలించాలి.. బయోమైనింగ్‌తో వ్యర్థాలను తొలగించాలి: తెలంగాణ రక్షణ సేన

కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్‌ నగర ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని బైపాస్‌ రోడ్డులోని డంపింగ్‌ యార్డును వెంటనే నగరానికి దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తతో డంపింగ్‌ యార్డు సమస్యగా మారిందని, జనావాసాలకు దూరంగా శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు.

తెలంగాణ రక్షణ సేన కరీంనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అంకం శివరాణి ఆధ్వర్యంలో డంపింగ్‌ యార్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్‌ మాట్లాడుతూ డంపింగ్‌ యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన, పొగ, దుమ్ము, ఇతర పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

డంపింగ్‌ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసన, పొగ, దుమ్ముతో కోతిరాంపూర్‌, లక్ష్మీనగర్‌, కట్టరాంపూర్‌, కొత్తయశ్వాడ, కమాన్‌ ప్రాంతం, బస్టాండ్‌, అంబేద్కర్‌ స్టేడియం పరిసరాలతో పాటు నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జనావాసాలకు సమీపంలో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు.

హామీలు అమలెప్పుడు?

డంపింగ్‌ యార్డు తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని హరిప్రసాద్‌ విమర్శించారు. డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, బండి సంజయ్‌ కుమార్‌, కరీంనగర్‌ మేయర్‌ హామీలు ఇచ్చినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదన్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా డంపింగ్‌ యార్డును ‘స్మార్ట్‌ డంప్‌యార్డ్‌’గా మారుస్తామని చెప్పిన మాటలు ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇకనైనా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. డంపింగ్‌ యార్డును నగరానికి దూరంగా తరలించడంతో పాటు ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్‌ విధానంలో పూర్తిగా తొలగించాలని కోరారు. భవిష్యత్తులో నగరంలో చెత్త పేరుకుపోకుండా తడి, పొడి వ్యర్థాలను వార్డు స్థాయిలోనే వేరు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్‌ చేసే శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా ఆదివాసీ విభాగం అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్‌, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్‌, జిల్లా సీనియర్‌ నాయకులు రంగరవేణి లక్ష్మణ్‌, బుడిగె పర్షారం గౌడ్‌, నూతి చరణ్‌, బాసవేణి రాజేందర్‌, యండి రజీ, పుసాల పవన్‌, కొత్తూరి రఘు, యండి హుస్సేన్‌, మడిపల్లి వినీత్‌, అభిరామ్‌, గర్షకుర్తి విద్యాసాగర్‌, గుంజపడుగు పవన్‌, సుత్తాల రాజన్న, మహిళా విభాగం నాయకురాలు యండి సల్మా, దాసరి అంజలి, దీటి శిరీష రమేష్‌, కొరిమి పద్మ, కొలిపాక గౌతమి, కాంతాల రోజారెడ్డి, కుతాడి రజిత, వరుణ్‌ యాదవ్‌, గడ్డం రవికుమార్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!