- పలు ఆహార పదార్థాల నమూనాల సేకరణ
జమ్మికుంట , ఆగస్టు 18 (చైతన్యగళం): జమ్మికుంట పట్టణంలో ఆహార భద్రత శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కొండూరు కాంప్లెక్స్ ప్రాంతంలోని వివిధ కిరాణా హోల్‌సేల్ దుకాణాలతో పాటు గ్రెయిన్ మార్కెట్ రోడ్ పరిధిలోని ఆయిల్ మిల్లులను అధికారులు తనిఖీ చేశారు.
తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను అధికారులు సేకరించారు. జమ్మికుంటలోని రెండు ఆయిల్ మిల్లుల్లో ఉత్పత్తి చేసిన వేరుశెనగ నూనెతో పాటు శనగపప్పు, వేరుశెనగలు, వివిధ రకాల కాన్ఫెక్షనరీ మిఠాయి ఉత్పత్తుల నమూనాలను సేకరించారు.

సేకరించిన నమూనాలను విశ్లేషణ నిమిత్తం గుర్తింపు పొందిన ప్రయోగశాలకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం–2006, సంబంధిత నిబంధనల ప్రకారం ఆయా ఆహార వ్యాపార సంస్థలపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఆహార వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆహార భద్రత శాఖ సూచించింది. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే విక్రయించాలని పేర్కొంది. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
