- అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
హనుమకొండ, ఆగస్టు 12(చైతన్యగళం): గ్రామాల అభివృద్ధితో పాటు పద్మశాలి కులబంధువుల సంక్షేమానికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు కృషి చేయాలని అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ జాతీయ అధ్యక్షులు, కేంద్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల బోర్డు పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు.హనుమకొండ పట్టణంలోని వి-గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పద్మశాలి గ్రామ సర్పంచులు, పద్మశాలి సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈగ మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పద్మశాలి సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి సంఘాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా పద్మశాలీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
*వరంగల్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలి*
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వరంగల్‌లో టెక్స్‌టైల్ డిజైనింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసి వినతిపత్రం అందజేసినట్లు ఈగ మల్లేశం తెలిపారు. గుజరాత్‌లో ఉన్న టెక్స్‌టైల్ డిజైనింగ్ కాలేజీ తరహాలో తెలంగాణలోనూ వరంగల్‌లో ఇలాంటి విద్యాసంస్థను ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.వరంగల్‌లో ఈ కాలేజీ ఏర్పాటైతే వరంగల్, హనుమకొండ జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు, యువతకు ఆధునిక టెక్స్‌టైల్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నత స్థాయి శిక్షణ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇతర మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ప్రాంతంలోనే ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా ఇప్పటికే వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, టెక్స్‌టైల్ డిజైనింగ్ కాలేజీ కూడా అందుబాటులోకి వస్తే వరంగల్ దేశంలోనే ప్రముఖ టెక్స్‌టైల్ హబ్‌గా ఎదిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పద్మశాలి సమాజ సంక్షేమానికి, ముఖ్యంగా చేనేత, అనుబంధ రంగాల కార్మికుల హక్కుల పరిరక్షణకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈగ మల్లేశం స్పష్టం చేశారు.
*పద్మశాలి ప్రజా ప్రతినిధులకు ఘన సన్మానం*
ఎన్నికల్లో విజయం సాధించిన పద్మశాలి సామాజికవర్గ సర్పంచులు, వివిధ సహకార సంఘాల నూతన అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఈగ మల్లేశం శాలువాలతో సత్కరించారు. తన తల్లిదండ్రులు ఈగ రాజమ్మ– వెంకటమల్లు జ్ఞాపకార్థం మెమంటోలు అందజేశారు. అనంతరం హనుమకొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బచ్చు ఆనందం, కార్యవర్గ సభ్యులు ఈగ మల్లేశంను శాలువా, మెమంటోతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, జిల్లా ప్రెస్ యూనియన్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తవుటం ఝాన్సీ రాణి రవీందర్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, వైద్యం రాజగోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పులికంటి రాజేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంగళ వేణుగోపాల్, కార్యవర్గ సభ్యుడు బొప్ప శివశంకర్, భద్రకాళి ఆలయ ధర్మకర్త బింగి సతీష్, రిటైర్డ్ డీసీపీ సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాశి వెంకటేశ్వర్లు, దిడ్డి రమేష్, ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, పోరంల రమేష్, నవీన్, సంతోష్, శోభన్‌బాబు తదితరులు, అధిక సంఖ్యలో పద్మశాలి కులబంధువులు పాల్గొన్నారు.
