సిద్దిపేట, సెప్టెంబర్ 3 (చైతన్య గళం):
గజ్వేల్ మండలం హవాయిగూడ గ్రామంలోని సర్వే నంబర్ 49 భూమికి సంబంధించి ఈనాడు, నమస్తే తెలంగాణ పత్రికల్లో ప్రచురితమైన వార్తలు వాస్తవ దూరంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పష్టం చేసింది. 52 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇతరులకు పంచినట్లు, అసైన్‌మెంట్ భూమిని పట్టా భూమిగా మార్చినట్లు వచ్చిన కథనాలు పూర్తిగా కల్పితమని పేర్కొంది సర్వే నంబర్ 49లో మొత్తం 83.04 గుంటల భూమి ఉండగా, 1959-60 పహాణీ ప్రకారం 31.27 గుంటలు ప్రభుత్వ భూమి (గైరాన్), 51.17 గుంటలు పట్టా భూమిగా నమోదై ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టా భూమి రఘుపతిరావు, నర్సయ్య పేర్లలో నమోదై ఉండగా, తదనంతరం ప్రభుత్వ భూమిని 37 మందికి అసైన్ చేసినట్లు వివరించారు. ఈ మేరకు పొడి, ఉపవిభజన రికార్డులు కూడా రూపొందించినట్లు తెలిపారు 1959-60 నుంచి 2010-11 వరకు ఉన్న పహాణీలను పరిశీలించినా 31.27 గుంటల ప్రభుత్వ భూమి 37 మంది అసైన్‌దారుల పేర్లతో, 51.17 గుంటల పట్టా భూమి రఘుపతిరావు, నర్సయ్య లేదా వారి వారసుల పేర్లతోనే కొనసాగినట్లు అధికారులు పేర్కొన్నారు ధరణి పోర్టల్‌లో వివరాల నమోదు సమయంలో 51.17 గుంటల పట్టా భూమిని పొరపాటున అసైన్‌మెంట్ భూమిగా వర్గీకరించినట్లు తెలిపారు. అనంతరం భూభారతి పోర్టల్‌లోనూ అదే నమోదు కొనసాగిందన్నారు. ఈ తప్పును సరిచేసేందుకు పట్టాదారులు దరఖాస్తు చేసుకోగా, రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అనంతరం గజ్వేల్ తహశీల్దార్, ఆర్డీవోల సిఫారసుల మేరకు జిల్లా కలెక్టర్ కేవలం భూమి వర్గీకరణ మార్పునకు మాత్రమే ఆమోదం తెలిపారని స్పష్టం చేశారు అసైన్‌దారులు, పట్టాదారులు లేదా వారి వారసుల పేర్లలో ఎలాంటి మార్పులు చేయలేదని, కేవలం భూభారతి పోర్టల్‌లో తప్పుగా నమోదైన భూమి వర్గీకరణను సరిచేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమిని ఇతరులకు పంచినట్లు వచ్చిన వార్తలు నిరాధారమని పేర్కొంటూ సంబంధిత పత్రికలు వాస్తవాలను ప్రచురించాలని కోరారు.
