Wednesday, August 26, 2026
Homeసంపాదకీయంట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ట్రంప్ సుంకాలపై మరో కేసు.. కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

📰 Generate e-Paper Clip

ట్రేడ్ యాక్ట్-1974 కింద మరోసారి ప్రపంచదేశాలపై సుంకాలు విధించిన యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టుకెక్కాయి.

వెట్టిచాకిరీతో చేసిన ఉత్పత్తులను అడ్డుకోలేని దేశాలపై 12.5 శాతం వరకూ సుంకాన్ని విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. భారత్‌ సహా 60 దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఈ సుంకాల భారం మోపారు. అయితే, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు కోర్టుకెక్కాయి. ఏకంగా 25 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశాయి. అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన అధికారాల పరిధిని మీరారని ఆరోపించాయి. న్యూయార్క్‌లోని యూఎస్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ఈ పిటిషన్ దాఖలైంది.

ట్రేడ్ యాక్ట్-1974 కింద సుంకాల విధింపును సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. గంపగుత్త సుంకాలు తగవని కోర్టులు ఇప్పటికే స్పష్టం చేసిన తరుణంలో కొత్త మార్గంలో వాటిని ట్రంప్ సర్కారు పునరుద్ధరిస్తోందని ఆరోపించాయి. అనైతిక వాణిజ్య విధానాలను అనుసరించే కొన్ని దేశాలను టార్గెట్ చేసేందుకు సెక్షన్ 301 ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. అన్ని దిగుమతులపైనా ప్రభావం పడేలా ఈ సెక్షన్ కింద సుంకాలు విధించడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. వెట్టిచాకిరీని కేవలం ఒక సాకుగా చూపించి సుంకాలను మళ్లీ విధించేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘ప్రతి దశలోనే ఎదురుదెబ్బలు తగిలినా ట్రంప్ మళ్లీ రభస చేసేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని ఒరేగాన్ అటార్నీ జనరల్ డాన్ రేఫీల్డ్ పేర్కొన్నారు.

జులై 24న ట్రంప్ ఈ సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెట్టిచాకిరీ అడ్డుకట్టకు చర్యలు తీసుకున్న కొన్ని ఉపశమనం లభించింది. భారత్‌పై సుంకాన్ని 12.5 నుంచి 10 శాతానికి ట్రంప్ సర్కారు తగ్గించింది. గతంలో ట్రంప్ ఎమర్జెన్సీ ఆర్థిక అధికారాల కింద ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసిందే. వాటిని కోర్టు కొట్టేయడంతో ఈసారి ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 ద్వారా సుంకాల బాదుడుకి దిగారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!