ఆయిల్ పామ్–కోకో సాగును విస్తరించాలి: జిల్లా ఉద్యాన శాఖ
మహబూబాబాద్, జూలై 30(చైతన్యగళం):
ఎల్‌నినో పరిస్థితుల్లో రైతులు సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న సూచించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘ప్రాజెక్ట్ వైవిధ్యం’ కార్యక్రమంలో భాగంగా గురువారం కురవి, నారాయణపురం గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కురవి గ్రామానికి చెందిన రైతు మేక వెంకట్ రెడ్డి ఆయిల్ పామ్ తోటలో పది ఎకరాల్లో అంతర పంటగా కోకో మొక్కలను రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి నాటారు. అనంతరం నారాయణపురంలో ఆయిల్ పామ్, మామిడి, కూరగాయల తోటలను పరిశీలించి రైతులకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో దృశ్య, శ్రావణ మాధ్యమాల ద్వారా పంట మార్పిడిపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఇప్పటికే 9,500 ఎకరాలకు చేరుకుందని తెలిపారు. ఆయిల్ పామ్ ప్రధాన పంటతో పాటు కోకో వంటి అంతర పంటల సాగు ద్వారా రైతులు మరింత ఆదాయం పొందవచ్చన్నారు. ఎకరానికి ఆయిల్ పామ్ ద్వారా సుమారు రూ.2 లక్షల వరకు, కోకో అంతర పంటతో అదనంగా రూ.25 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని వివరించారు.
మొదటి నాలుగేళ్లలో బొప్పాయి, జామ, కూరగాయలు, పప్పుధాన్యాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయవచ్చని, తోటకు నీడ వచ్చిన తర్వాత కోకో, మిరియాలు, అనాస, వక్క, జాజికాయ వంటి అధిక విలువైన పంటలు సాగు చేసి మరింత లాభాలు పొందవచ్చని తెలిపారు.
ఆయిల్ పామ్, కోకో సాగుకు ప్రభుత్వం గణనీయమైన రాయితీలు అందిస్తున్నందున రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే ఉద్యాన, కూరగాయలు, ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. విజయచంద్ర, వ్యవసాయ సహాయ సంచాలకుడు పి. మురళి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. దిలీప్, ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ప్రశాంత్, ఉద్యాన శాస్త్రవేత్త సుహాసిని, మండల వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, కోకో కంపెనీ ప్రతినిధులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
