Wednesday, July 29, 2026
Homeభక్తి - ఆధ్యాత్మికతగురువే దైవం – గురు పౌర్ణమి విశిష్టత

గురువే దైవం – గురు పౌర్ణమి విశిష్టత

📰 Generate e-Paper Clip

గురువే దైవం – గురు పౌర్ణమి విశిష్టత

గురు పౌర్ణమి : జ్ఞానానికి, గురువులకు కృతజ్ఞతలు తెలిపే మహోన్నత పర్వదినం “గురువు అనుగ్రహం లేనిదే జ్ఞానం సిద్ధించదు… జ్ఞానం లేనిదే జీవితం పరిపూర్ణం కాదు.” గురు పౌర్ణమి భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితానికి దిశానిర్దేశం చేసిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే మహోన్నత సందర్భం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాస పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భారతీయ సనాతన ధర్మంలో తల్లి, తండ్రి తర్వాత అత్యున్నత స్థానం గురువుకే దక్కింది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువు జీవితానికి అర్థం చెప్పి జ్ఞానాన్ని అందిస్తాడు. మంచి–చెడులను వివేచించే శక్తిని, సత్యమార్గంలో నడిచే ధైర్యాన్ని, మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాసాన్ని గురువే నేర్పిస్తాడు. అందుకే భారతీయులు గురువును దైవస్వరూపంగా భావిస్తూ.

“గురు బ్రహ్మా గురు విష్ణుః

గురు దేవో మహేశ్వరః।

గురుః సాక్షాత్ పరబ్రహ్మ

తస్మై శ్రీ గురవే నమః॥

అని భక్తితో నమస్కరిస్తారు.

సంస్కృతంలో “గు” అంటే అజ్ఞానం, “రు” అంటే జ్ఞానవెలుగు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే మహోన్నత వ్యక్తే గురువు. గురువు కేవలం పాఠ్యాంశాలను బోధించే వ్యక్తి మాత్రమే కాదు; విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించే శిల్పి, సమాజాన్ని తీర్చిదిద్దే మార్గదర్శి. పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు ఆషాఢ పౌర్ణమి రోజున జన్మించారు. వేదాలను విభజించి, మహాభారతం, పురాణాల ద్వారా భారతీయ జ్ఞాన సంపదను ప్రపంచానికి అందించిన ఆయనను స్మరించుకుంటూ ఈ రోజును వ్యాస పౌర్ణమిగా కూడా జరుపుకుంటారు. నేటి ఆధునిక సమాజంలో గురువుల బాధ్యత మరింత పెరిగింది. విద్యార్థులకు పాఠాలు బోధించడం మాత్రమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే విజ్ఞానం, నైతిక విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యత, మానవత్వం వంటి గొప్ప లక్షణాలను పెంపొందించడం గురువుల ధర్మం. గురువు చేతుల్లోనే విద్యార్థి వ్యక్తిత్వం, కుటుంబ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటాయి. గురు పౌర్ణమి రోజున విద్యార్థులు తమ గురువులను సత్కరించి ఆశీస్సులు పొందుతారు. గురువులు బోధించిన విలువలను జీవితంలో ఆచరించడం, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగడం, గురువుకు ఇచ్చే గొప్ప గురుదక్షిణ.

సందేశం: గురువులను గౌరవించడం అంటే కేవలం ఒక రోజు పూలమాల వేయడం కాదు. వారు బోధించిన జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడం, మంచి మనిషిగా ఎదగడం, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా నిలవడం నిజమైన గురుదక్షిణ. మన జీవితంలో వెలుగులు నింపిన ప్రతి గురువుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుదాం. గురువులను గౌరవిద్దాం… గురుపరంపరను కాపాడుదాం… జ్ఞాన భారత నిర్మాణంలో భాగస్వాములమవుదాం.

సర్వ గురువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

 

రచన:

వేల్పుల మహేందర్ ఎమ్మెస్సీ.ఎంఏ.ఎంఈడి అధ్యాపకులు. అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!