- మున్సిపల్ అభివృద్ధికి వినియోగించాలని కౌన్సిలర్ల డిమాండ్
ఆమనగల్లు, జూలై 28 (చైతన్యగళం):
ఆమనగల్ మున్సిపాలిటీ శివారులోని సంకటోనిపల్లి పరిధి సర్వే నంబర్-1027లో ఉన్న 4.06 గుంటల ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాలో ఉందని, దానిని వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని ఆమనగల్లు మున్సిపల్ కౌన్సిలర్లు మంగళవారం ఎంఆర్వోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి తోటలు, పంటలు సాగు చేస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని వారు కోరారు. అనంతరం ఆ స్థలాన్ని పార్కు, కమ్యూనిటీ హాల్, పిల్లల ఆటస్థలం లేదా ఇతర మున్సిపల్ అభివృద్ధి పనులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ కబ్జాలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ స్థలాలను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ప్రజా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎనుమల్ల రమేష్, ఎర్రవోలు మహేష్, మొక్తల వెంకటయ్య, నాగిళ్ల జగన్ పాల్గొన్నారు.
