పెద్దపల్లి, జూలై 27 (చైతన్యగళం):
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి కలిసి న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కనీసం 1000 ఉద్యోగాలు కల్పించాలని, ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ రూ.10,000 అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇంకా సింగరేణి సంస్థ అభివృద్ధి, బొగ్గు గనుల విస్తరణ, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చించారు.
ఈ అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనుల వేగవంతం, స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలు, అలాగే సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికుల పెన్షన్ అంశంపై సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
