Monday, July 27, 2026
Homeతెలంగాణకార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

కార్గిల్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

📰 Generate e-Paper Clip

  • విద్యార్థులు దేశభక్తి స్ఫూర్తితో సైన్యంలో చేరాలి.. వచ్చే ఏడాది నాటికి మహబూబాబాద్‌లో కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి: ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్

మహబూబాబాద్, జూలై 26(చైతన్యగళం): కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూనిన మాజీ సైనికులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు ‘కార్గిల్ అమర జవాన్లకు జోహార్.. జోహార్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సెంటర్‌లో కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కార్గిల్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీ నాయక్ బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ చరిత్ర, స్వాతంత్ర్య సమరయోధులు, సైనికుల త్యాగాల గురించి విద్యార్థులకు తెలియజేసి, యువత సైన్యంలో చేరేలా ప్రోత్సహించాలని కోరారు. వచ్చే ఏడాది నాటికి మహబూబాబాద్‌లో కార్గిల్ స్తూపం నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అగ్నివీర్ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న కార్గిల్ యుద్ధ వీరుడు, మహబూబాబాద్‌కు చెందిన మాజీ వాయుసేన యోధుడు శ్రీకొమ్ము కేశవరావు మాట్లాడుతూ.. నేటి యువత ఉన్నత విద్య, విదేశీ చదువులు, ఇంజినీరింగ్, వైద్య విద్య, కంప్యూటర్ సైన్స్ వంటి రంగాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఆర్థికంగా వెనుకబడిన మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన యువత అగ్నివీర్‌ వంటి సైనిక నియామక అవకాశాలను వినియోగించుకుని దేశ సేవతో పాటు తమ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. అగ్నివీర్‌గా నాలుగేళ్లు సేవలందించే సమయంలో జీతంతో పాటు క్రమశిక్షణ, శిక్షణ, అనుభవం లభిస్తాయని తెలిపారు. సేవ అనంతరం లభించే ఆర్థిక ప్రయోజనాలతో పాటు మాజీ సైనికులకు అందుబాటులో ఉండే రిజర్వేషన్లు, రుణ సదుపాయాలను ఉపయోగించుకుని ఉన్నత విద్యను కొనసాగించడంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు, స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

తెలంగాణలో అగ్నివీర్‌ నియామకాలపై యువతలో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేశవరావు పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశానికి సేవ చేయడంతోపాటు తల్లిదండ్రులకు, సమాజానికి అండగా నిలిచి విజేతలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, మున్సిపల్ కమిషనర్ వినోద్, కౌన్సిలర్లు, మాజీ సైనికులు, విద్యార్థులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!