Tuesday, July 28, 2026
Homeతెలంగాణకార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

📰 Generate e-Paper Clip

  • దేశ సమగ్రత కోసం 527 మంది సైనికుల అమరత్వం.. వారి త్యాగం యావత్ జాతికి స్ఫూర్తిదాయకం
  • నేతాజీ, వీరనారి నీరా ఆర్య త్యాగాలు కూడా దేశభక్తికి ప్రతీకలు: డా. కందుల నాగరాజు

మహబూబాబాద్, జూలై 26(చైతన్యగళం): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేతాజీ సేవా సమితి వ్యవస్థాపకుడు డా. కందుల నాగరాజు అన్నారు. 1999లో కార్గిల్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు, చొరబాటుదారులు చేపట్టిన ఆక్రమణ ప్రయత్నాన్ని భారత సైన్యం వీరోచితంగా తిప్పికొట్టి దేశ సమగ్రతను కాపాడిందని తెలిపారు.

1984లో భారత్ చేపట్టిన ఆపరేషన్ మేఘదూత్ ద్వారా వ్యూహాత్మకంగా కీలకమైన సియాచిన్ హిమనదంపై ఆధిపత్యం సాధించిందని, అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ పలు కుట్రలకు పాల్పడిందని పేర్కొన్నారు. కార్గిల్ శిఖరాలను ఆక్రమించడం ద్వారా శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై ఆధిపత్యం సాధించి, లేహ్ ప్రాంతానికి భారత సైన్యం తరలించే ఆయుధాలు, ఆహారం, ఇతర సైనిక సామగ్రి సరఫరాలకు ఆటంకం కలిగించాలన్నది పాకిస్థాన్ వ్యూహంగా ఉందన్నారు. 1998లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి భారత్– పాకిస్థాన్ మధ్య శాంతి, స్నేహ సంబంధాల కోసం విశేష కృషి చేశారని డా. నాగరాజు గుర్తుచేశారు. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సు యాత్ర చేపట్టి, లాహోర్ ప్రకటన ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే పాకిస్థాన్ ఆ శాంతి ప్రయత్నాలను వమ్ము చేస్తూ కార్గిల్ ప్రాంతంలో రహస్యంగా సైనికులను, చొరబాటుదారులను మోహరించి యుద్ధానికి తెరలేపిందని ఆరోపించారు. 1998లో భారత్, పాకిస్థాన్ అణు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయని, ఈ పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, భారత్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడం, శ్రీనగర్–లేహ్ మార్గాన్ని అడ్డుకోవడం వంటి లక్ష్యాలతో కార్గిల్ చొరబాటుకు పాకిస్థాన్ పాల్పడిందని వివరించారు.
కార్గిల్ యుద్ధంలో భారత భూసేన ఆపరేషన్ విజయ్, భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్, భారత నౌకాదళం ఆపరేషన్ తల్వార్ ద్వారా సమన్వయంతో పోరాడి శత్రు మూకలను తరిమికొట్టాయని తెలిపారు. సుమారు 16 వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో, ఆక్సిజన్ కొరతతో కూడిన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత సైనికులు అసాధారణ ధైర్యసాహసాలతో పోరాడి కార్గిల్ శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారని, వందలాది మంది గాయపడినా దేశ సమగ్రతను కాపాడేందుకు వారు చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. 1999 జూలై 26న సాధించిన కార్గిల్ విజయం భారత సైన్యం అపారమైన ధైర్యసాహసాలకు, క్రమశిక్షణకు, దేశభక్తికి నిదర్శనమని తెలిపారు. కార్గిల్ అమరవీరుల త్యాగం యావత్ భారత జాతికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని డా. కందుల నాగరాజు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆజాద్ హింద్ ఫౌజ్ సర్వసైన్యాధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను స్మరించుకుంటూ, భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ)తో అనుబంధం ఉన్న వీరనారి నీరా ఆర్య సేవలను కూడా ప్రత్యేకంగా గుర్తుచేశారు. నేతాజీ పట్ల ఆమె చూపిన అంకితభావం, దేశభక్తి, త్యాగస్ఫూర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. బ్రిటిష్ పాలకుల చిత్రహింసలను ఎదుర్కొన్నప్పటికీ దేశం కోసం ఆమె చూపిన ధైర్యం, త్యాగం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగస్ఫూర్తి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వం, వీరనారి నీరా ఆర్య ధైర్యసాహసాలు, కార్గిల్ అమరవీరుల వీరత్వం—ఇవన్నీ భారతదేశం పట్ల అచంచలమైన దేశభక్తికి ప్రతీకలని డా. కందుల నాగరాజు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!